prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:40 pm Digital Edition : RAKESH PEDDAPALLY

భారీ వర్షాలపై రామగుండం పోలీసుల హైఅలర్ట్ క్షేత్రస్థాయిలో సీపీ అంబర్ కిషోర్ ఝా పరిశీలన

 

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

గోదావరిఖని జూలై 29 ప్రజావాణి:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం తీవ్ర అప్రమత్తమైంది. పెద్దపల్లి జోన్ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ (RFCL) ప్రాంతం నుండి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరింది. ఈ సమాచారం అందుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ పర్యటనలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్, ప్రవాహం తీవ్రంగా ఉన్నందున ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్దకు ఎవరూ వెళ్లకూడదని సీపీ సూచించారు. ముఖ్యంగా గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తత పాటించాలని, ప్రాజెక్టులు, చెరువుల వద్దకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అంతేకాకుండా, రహదారులపై వర్షపు నీరు నిలిచి ఉన్నందున వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని, వాహనదారులు వేగాన్ని తగ్గించి అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.

పిల్లలు, యువకులు ప్రమాదకర రీతిలో వాగులు, చెరువుల వద్దకు సెల్ఫీలు దిగడానికి లేదా ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం లేదా ప్రమాద పరిస్థితి ఏర్పడితే ప్రజలు వెంటనే డయల్-100 కి కాల్ చేయాలని లేదా స్థానిక పోలీసు అధికారులను సంప్రదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.