prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 9:46 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారం డివిజన్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశం విజయవంతం.. రానున్న ఎన్నికల్లో పోచారంలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్

ఘట్‌కేసర్, జూలై 20: భారతీయ జనతా పార్టీ పోచారం డివిజన్ కార్యవర్గ సమావేశం పోచారం డివిజన్ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన అన్నోజిగూడలోని శివాస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం డివిజన్‌లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, కృషిని చూస్తుంటే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే బీజేపీ ద్విచక్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేస్తారని, దానిని ఎవ్వరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతున్నాయని, ప్రజల్లో బీజేపీపై రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.

సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, బీఎల్‌ఏ–2 కార్యక్రమాల అమలు, డివిజన్‌లోని ప్రజా సమస్యలు, ముఖ్యంగా తాగునీటి కొరత, డంపింగ్ యార్డ్ సమస్యలు, బూత్ స్థాయి విస్తరణ, సభ్యత్వ నమోదు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతి బూత్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ నాయకుడు బిక్కు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గొంగళ్ల బాలేష్, మాజీ కౌన్సిలర్ మహేష్, పాండు రాజ్, కళ్యాణ్ నాయక్, శివ నాయక్, అజయ్ డీటీ నాయక్, డివిజన్ ఉపాధ్యక్షుడు గిరి, ప్రధాన కార్యదర్శులు కోన మల్లేష్, రేతి వెంకటేష్, గొరిగి శ్రీనివాస్, సుందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే డివిజన్ కార్యవర్గ సభ్యులు, మోర్చా అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.