prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 3:59 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్ల ఉన్నత పాఠశాలలో నరకం: చేతులు కడుక్కునే స్థలమా లేక రోగాల నిలయమా? అధ్వాన్నంగా మారిన ప్రాంగణం.నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు!

కడప జిల్లా ప్రజావాణి జూన్ 16 పోరుమామిళ్ల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.చదువుల తల్లి నిలయం కావాల్సిన పాఠశాల,నేడు విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడే మురికికూపంగా మారింది.కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ,పరిశుభ్రతను పాటించడంలోనూ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఘోరంగా విఫలమయ్యారు.పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన ఉమ్మడి కుళాయిల  ప్రాంతం అత్యంత దయనీయంగా మారింది. చేతులు కడుక్కునేందుకు కనీసం ఒక్క కుళాయిలో కూడా నీరు రాకపోవడం గమనార్హం. నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నీరు లేకపోవడమే కాకుండా,ఆ ప్రాంతమంతా వర్షపు నీటితో నీరు నిలిచిపోయి ఒక పెద్ద చెరువును తలపిస్తోంది.విద్యార్థులు తిని వదిలేసిన అన్నం ముద్దలు,ఆహార పదార్థాల వ్యర్థాలు, చెత్తాచెదారం ఆ నీటిలోనే పేరుకుపోయి కుళ్ళిపోతున్నాయి.దీనివల్ల ఆ ప్రాంతం నుంచి తట్టుకోలేనంత తీవ్రమైన మురికి వాసన,కంపు కొడుతోంది.ఈ అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు,ఈగలు విపరీతంగా పెరిగిపోయి ఈ ప్రాంతం భయంకరమైన రోగాలకు నిలయంగా మారింది.నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇక్కడే తిరుగుతుండటంతో,వారి ఆరోగ్యం ఏ క్షణమైనా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.ఈ దారుణ పరిస్థితి అంతా పాఠశాల ఆవరణలోనే స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ,అక్కడి ఉపాధ్యాయులు మాత్రం కళ్లున్నా కనపడనట్లు, చెవులున్నా వినపడనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.విద్యార్థులకు క్రమశిక్షణ,పరిశుభ్రత నేర్పించాల్సిన గురువులే.పాఠశాల ప్రాంగణం ఇంతలా తగలబడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.దేనికి కూడా శుభ్రత అనేది లేకుండా,విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా టీచర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.పాఠశాల యాజమాన్యం ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి,తక్షణమే స్పందించి ఆ మురికి నీటిని తొలగించి,కుళాయిలకు నీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఉన్నతాధికారులు కూడా దీనిపై కఠినంగా స్పందించి,నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.