కెసిఆర్ నగర్ లో కాళీ బిందెలతో మహిళల నిరసన
తంగళ్లపల్లి ప్రజావాణి జూన్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో మహిళలు కాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. గత మూడు రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు కాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.తమకు వెంటనే తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మూడు గంటలకుపైగా నిరసన కొనసాగించిన మహిళలు, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నగర్‌లో తాగునీటి సమస్యతో పాటు పలు మౌలిక వసతుల సమస్యలు నెలకొన్నాయని, పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందనిఆరోపించారు.అదేవిధంగా కాలనీలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు 15 రోజులకు ఒకసారి మాత్రమే ట్రాక్టర్‌ను పంపుతున్నారని, దీంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని మహిళలు తెలిపారు.జిల్లా అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు ఉన్నట్టా లేనట్టా వ్యవహరిస్తున్నారని మహిళలు నిరసన సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.