prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 5:57 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సర్కారు బడిలో ‘బాబా’ అవినీతి దందా.టీసీ కావాలంటే వెయ్యి సమర్పించుకోవాల్సిందే!

గంటల తరబడి నిలబడుతున్న విద్యార్థులు,తల్లిదండ్రులు.అడిగేవారే లేరా?

పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 18) పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థుల నుంచి టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) ఇవ్వడానికి ఇక్కడి పాఠశాలలో పనిచేస్తున్న క్లర్క్ బాబా ఫక్రుద్దీన్ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కో విద్యార్థి నుండి రూ.500 నుండి రూ.1000 వరకు డిమాండ్ చేస్తూ నిలువు దోపిడీకి తెరలేపారు.
సీట్లో కూర్చోడు.సర్టిఫికెట్లు ఇవ్వడు!
పాఠశాల పనివేళల్లో సదరు క్లర్క్ ఏనాడూ తన సీట్లో సక్రమంగా కూర్చోడనే విమర్శలు ఉన్నాయి. విధి నిర్వహణను గాలికొదిలేసి,తన సొంత పనులపై తిరగడం లేదా కార్యాలయ సమయాల్లో అందుబాటులో ఉండకపోవడం ఇతనికి అలవాటుగా మారింది.దీనివల్ల వివిధ గ్రామాలు,దూర ప్రాంతాల నుంచి సర్టిఫికెట్ల కోసం వచ్చే పేద విద్యార్థులు,వారి తల్లిదండ్రులు గంటల తరబడి కార్యాలయం ముందే పడిగాపులు కాయాల్సి వస్తోంది.‘సార్ ఎప్పుడొస్తారో.ఎప్పుడు సంతకం పెడతారో’ తెలియక ఎండలో నిలబడి వెయిట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది.ఉచితంగా ఇవ్వాల్సిన టీసీకి వందలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రభుత్వ జీతం తీసుకుంటూ విద్యార్థులను గంటల తరబడి వేచి చూసేలా చేయడం ఏ రకమైన విధి నిర్వహణ? ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ క్లర్క్ ఇంతలా రెచ్చిపోతున్నారా? భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో పైచదువులకు వెళ్లాలనుకునే పదో తరగతి విద్యార్థులను ఇలా మానసికంగా,ఆర్థికంగా వేధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,విద్యార్థులను పీడించుకు తింటున్న సదరు క్లర్క్ బాబా ఫక్రుద్దీన్‌పై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు,తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పాఠశాల ముందే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరిస్తున్నారు.