prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 2:17 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు నగర పాలక సంస్థ, నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని,అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు.బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3,మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం,శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల పురోగతిపై ఆయా విభాగాలు, జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగరంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తాయని, అందుకు తగిన విధంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, ప్రతి పనికి తగిన కాలపరిమితి విధించుకొని చేయాలన్నారు. శంకర్ విలాస్ వంతెన పనులు ఈ ఏడాది చివరికి పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్ నిర్మాణ సామగ్రి, కార్మికులను సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. పనులు జరిగే సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3 పనులు ఆగస్ట్ నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని స్పష్టం చేశారు. పనులు నిర్దేశిత గడువు మేరకు జరిగేలా ప్రజారోగ్య ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ తో, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. మిర్చి యార్డ్ దగ్గర ఫ్లై ఓవర్ నిర్మాణం పనులకు ఏవిధమైన అడ్డంకులు లేనందున జూలై 15 నాటికి పూర్తీ చేసే లక్ష్యంతో ఉండాలన్నారు.సమావేశాల్లో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ డి.శ్రీనివాస్, జిఎంసి ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిఆర్డీఏ సీనియర్ ఇంజినీర్ సాయి, ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్, ఏపీసిపిడీసిఎల్, ఆర్&బి, ఎన్.హెచ్.ఐ అధికారులు, ఆయా ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు