prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:15 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అంబేద్కర్ జయంతి వేళ రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ

చిత్తూరు/రామ్ కుప్పం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ చొరవను అభినందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ఈ పాఠశాలను దత్తత తీసుకుని, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మెగా సంస్థను చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు.

అనంతరం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారు (IAS), మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి శ్రీ M.G.V.K. భాను గారు (Rtd. IAS), KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్ గారు (IAS), ప్రభుత్వ విప్ మరియు MLC శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు, APSRTC వైస్ చైర్మన్ శ్రీ P.S. మునిరత్నం గారు, PKM UDA చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు గారు పాల్గొని, అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేళ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చి, మహత్తర కార్యక్రమానికి పూనుకోవడం స్పూర్తి దాయకం అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు.

అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ M.G.V.K. భాను గారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “తాము కేవలం CSR నిధుల ద్వారా భవనాలను నిర్మించి లేదా నిధులను ఇచ్చి వదిలేయడం లేదు. మా ప్రధాన లక్ష్యం నిధుల ఖర్చు మాత్రమే కాదు, ఇక్కడ చదువుకునే విద్యార్థుల ప్రవర్తనలో (Behavioral Change) మార్పు తీసుకురావడం. వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చి, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారానే దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి రోజే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం మెగా సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అధికారులు, నాయకులు తెలిపారు.