prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 6:55 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి అక్రమ కంకర క్వారీలు క్రషర్ యూనిట్లను తొలగించాలి రాళ్లకత్వ గ్రామస్థుల వినతి

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి.. అక్రమ కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లను తొలగించాలి రాళ్లకత్వ గ్రామస్థుల వినతి

*ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన

జిన్నారం, జూలై 4(ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులో అక్రమంగా కొనసాగుతున్న కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లను వెంటనే నిలిపివేసి తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మండల తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామ శివారులో హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లు కొనసాగుతున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని వారు పేర్కొన్నారు. ఈ యూనిట్ల కారణంగా గ్రామంలో దుమ్ము, శబ్ద కాలుష్యం తీవ్రస్థాయికి చేరి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, రైతుల వ్యవసాయ భూములు, పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇళ్లకు పగుళ్లు ఏర్పడే ప్రమాదంతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తులకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు.
అక్రమ క్వారీల అనుమతుల్లో లోపాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ, యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మండల తాసిల్దార్ వెంటనే జోక్యం చేసుకుని అక్రమ కంకర క్వారీలు, క్రషర్ యూనిట్లను నిలిపివేసి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.