prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:28 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ పై ప్రత్యేక దృష్టి సారించాలి

*స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ పై ప్రత్యేక దృష్టి సారించాలి*

*ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇండీ పప్పీ అడాప్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – కమిషనర్ బి. శరత్ చంద్ర*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కమిషనర్ బి. శరత్ చంద్ర ఆధ్వర్యంలో సెక్షన్ హెడ్‌లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, టీఎంసీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మేప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు శానిటరీ జవాన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నల్గొండ నగరానికి మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. నగర ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛమైన నల్గొండ లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ” లో భాగంగా నిర్వహించనున్న ఇండీ పప్పీ అడాప్షన్ ప్రోగ్రామ్ పై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో ఉన్న ఇండీ పప్పీల వివరాలను వార్డు వారీగా గుర్తించి నమోదు చేయాలని మేప్మా రిసోర్స్ పర్సన్స్, వార్డు అధికారులు మరియు శానిటరీ జవాన్లకు కమిషనర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను ఆదివారం నాటికి పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. రాబోయే వారంలో ఇండీ పప్పీ అడాప్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండీ పప్పీలను దత్తత తీసుకునే వారికి అడాప్షన్ సర్టిఫికెట్ అందజేయబడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండీ పప్పీలను దత్తత తీసుకోవాలని, జంతు సంరక్షణ పట్ల బాధ్యతతో ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వెటర్నరీ & యానిమల్ హస్బెండరీ శాఖతో సమన్వయం చేసుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, మేప్మా సిబ్బంది, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.