prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 7:40 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

సైన్యంలో చేరేందుకు ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన తల్లి: అబుదాబి నుంచి కొడుకుని రప్పించాలని వినతి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 25 (ప్రజావాణి):

భారత సైన్యంలో ‘అగ్నివీర్’గా చేరి దేశసేవ చేయాలన్న తన కుమారుడి కల నెరవేర్చేందుకు ఓ తల్లి ప్రభుత్వం సాయాన్ని కోరారు. అబుదాబిలో చిక్కుకున్న తన కొడుకుని అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన కొప్పర్తి అభిలాష్, స్థానిక గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై ఈ నెల 8న అబుదాబికి వెళ్లారు. అక్కడ ఈ నెల 13న అతనికి ఎంప్లాయిమెంట్ వీసా జారీ అయింది. అయితే, సైన్యం నిర్వహిస్తున్న ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఫిజికల్ స్క్రీనింగ్ (దేహదారుఢ్య పరీక్ష)కు షార్ట్‌లిస్ట్ అయినట్లు ఈ నెల 14న అభిలాష్‌కు ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందింది. దేశం తరఫున పోటీపడే అవకాశం వచ్చినప్పటికీ, ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వీసా రద్దుకు షరతులు విధిస్తోందని అభిలాష్ తల్లి సుమలత వాపోయారు. వీసా రద్దు చేసి భారత్‌కు పంపాలంటే 4,100 యూఏఈ దిర్హాములు (సుమారు ₹1.08 లక్షలు) జరిమానా చెల్లించాలని కంపెనీ రిక్రూటింగ్ ఏజెంట్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. “నా కుమారుడు భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేది అతడి చిరకాల స్వప్నం. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని నా కొడుకుని సురక్షితంగా మాతృదేశానికి రప్పించాలని అభిలాష్ తల్లి సుమలత కోరుతున్నారు. ఈ అంశంపై ‘సీఎం ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కె విద్యాసాగర్ వెంటనే స్పందించారు. పేద కుటుంబానికి చెందిన ఈ యువకుడికి తగిన సహాయం అందించి, అత్యవసరంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి బాధిత కుటుంబానికి మార్గదర్శనం చేయగా, ‘ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్‌డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.