prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 5:01 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

సూరారం గ్రామంలో విషాదం, వడదెబ్బతో రైతు మృతి

వ్యవసాయ పనుల్లో ఉండగా వడదెబ్బతో రైతు మృతి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 30 (ప్రజావాణి):

ఎండల తీవ్రతకు జగిత్యాల జిల్లాలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయారు. ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన జాడీ లచ్చయ్య (62) అనే రైతు ఏప్రిల్ 29, బుధవారం రోజున తన వ్యవసాయ పొలంలో పంట కోత పనుల్లో నిమగ్నమై ఉండగా వడదెబ్బకు గురయ్యారు. పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై లచ్చయ్య స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఇంటికి తరలించి, చికిత్స కోసం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, లచ్చయ్యను పరీక్షించగా అప్పటికే ఆయన మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుని భార్య జాడీ రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పులిచర్ల ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన తర్వాత, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.