సిద్దిపేట్, ఏప్రిల్ 5, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజీఆర్ చౌరస్తా వద్ద డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి హాజరై, దళిత సంఘాల నాయకులతో కలిసిబీజీఆర్ చౌరస్ వద్దగల డా: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ లు దళితసంఘ నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయసాధనకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఒక నాయకుడు ఉన్నత స్థాయికి ఎదగాలంటే అనేక సవాళ్లను ఎదుర్కొని, సమస్యలను అధిగమించే ధైర్యం అవసరమని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వం లో అనేక శాఖలకు మంత్రిగా పనిచేయడమే కాకుండా దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతమైన సేవలను దేశానికి అందించారని అన్నారు.మహనీయుల ఆశయాలు, కృషిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షించారు.అలాగే డా. బి.ఆర్. అంబేద్కర్ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత నాయకుడని, మహిళల సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. అందరికీ అవకాశాలను కల్పించే దిశగా మనకోసం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసిన ఘనత డా. అంబేద్కర్ గారిదేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
మానసిక, శారీరక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, షెడ్యూల్డ్ కులాలకు అవసరమైన నిధుల కేటాయింపుకు సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.ఇదిలా ఉండగా, బీజీఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డిఓ సదానందం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీద్ వివిధ సంఘాల నాయకులు బొమ్మల యాదగిరి, నాయకులు బైరి రాజేశం, ఎర్రమహేందర్, లింగంపల్లి శ్రీనివాస్, బయ్యారం ఇస్తారి, పరుశరాములు, డి.శంకర్, భీమసేన, ఎల్లేష్, రామస్వామి, చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.