prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:03 am Digital Edition : PRAJA VANI

సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ సమరశంఖం

*సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ సమరశంఖం*

*జీవో 641 రద్దు వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం*
*అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన పోరాట కమిటీ*
షాద్‌నగర్, ప్రజావాణిజూలై 27: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామ ప్రజల ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐతో పాటు కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం జూలై 2న జారీ చేసిన జీవో 641 ద్వారా సిద్దాపూర్‌లో ఎకో పార్క్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. జీవో జారీకి ముందే గ్రామ ప్రజలు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే డంపింగ్ యార్డును అనుమతించబోమని హామీ ఇచ్చినప్పటికీ, అనంతరం జీవో జారీ కావడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆరోపించారు.
జీవో 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆ లక్ష్యం సాధించే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
జేఏసీ చైర్మన్ రాంబల్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు డంపింగ్ యార్డు వల్ల ఏర్పడే పర్యావరణ, ఆరోగ్య సమస్యలను వివరించారు. డంపింగ్ యార్డు ఏర్పాటుతో చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి కోసం భూములను సమీకరించామని, అదే ప్రాంతాన్ని ప్రస్తుతం డంపింగ్ యార్డు కోసం కేటాయించడం విచారకరమని అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు ఏర్పాటైతే పరిసర ప్రాంతాల నీటి వనరులు కలుషితమై ప్రజల జీవన విధానం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 641 రద్దు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జేఏసీ రూపొందించిన వాల్ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యాచరణ చేపడతామని జేఏసీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రాంబల్ నాయక్, కన్వీనర్ పినపాక ప్రభాకర్, సలహాదారులు వంగూరి గంగిరెడ్డి, అబ్దుల్ రబ్ జామి, రాజవరప్రసాద్, కో-చైర్మన్లు దొడ్డి శ్రీనివాస్, ఎమ్మె సత్యనారాయణ, బొజ్జా శ్రీనివాస్ రెడ్డి, వడ్డె బాలయ్య, రజిత నాయక్, బుద్దల జంగయ్య, ఈశ్వర్ నాయక్, రవీంద్రనాథ్, టి.జి. శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.