సిగాచీ బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలి
జూన్ 30న బాధితులతో సంస్మరణ సభ నిర్వహణ
వారం రోజుల్లో నష్టపరిహారం ఇవ్వకపోతే ఉద్యమం: బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
పటాన్‌చెరు, జూన్ 23 (ప్రజావాణి):సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ప్రమాద బాధితులకు ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడి చికిత్స పొందుతూ మరణించారని, కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని తెలిపారు.
జూన్ 30 నాటికి ఈ విషాద ఘటనకు ఏడాది పూర్తవుతున్నప్పటికీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పూర్తి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1 కోటి పరిహారంలో ఇప్పటివరకు రూ.25 లక్షలు మాత్రమే అందించారని ఆరోపించారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు రావాల్సిన మొత్తం నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లోగా పూర్తి పరిహారం అందించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు జూన్ 30న సిగాచీ పరిశ్రమ పేలుడు బాధితులతో కలిసి సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో మృతిచెందిన కార్మికులకు నివాళులర్పించడంతో పాటు బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశామని, ప్రస్తుతం కేంద్రం కొనుగోలు చేసే పరిమితికే రాష్ట్రం కూడా కొనుగోలు చేస్తామని నిర్ణయించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.