సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ దాడి – సీఐ, ఎస్సై విచారణ
కడప జిల్లా, పులివెందుల: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించడం జిల్లా పోలీసు వ్యవస్థలో కలకలం రేపింది. రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్సై అనిల్ కుమార్‌లను ఏసీబీ అధికారులు స్టేషన్‌లోనే గంటల తరబడి విచారించారు.
చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన పోలీసులు, ఆ వాహనాన్ని విక్రయించిన కదిరి ప్రాంతానికి చెందిన ఏజెంట్ బ్రహ్మం వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. గత శనివారం బ్రహ్మం ద్వారా రూ.1 లక్ష లంచం తీసుకున్న పోలీసులు, మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల పన్నాగంతో సోమవారం మరో రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పోలీసులు పట్టుబడ్డారు. లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్సైలను సుమారు మూడు గంటల పాటు విచారించారు.