*సహకార సంఘం కాదు.. ‘స్వాహా’కార సంఘం!*
చెన్నారావుపేట పీఏసీఎస్ లెక్కల్లో భారీ గందరగోళం.
లక్షల రూపాయల గోల్‌మాల్‌పై సీపీఐ నిప్పులు.
పూర్తిస్థాయి ఆడిట్‌కు పత్తి అనంతరెడ్డి డిమాండ్.
చెన్నారావుపేట మార్చి 30 (ప్రజావాణి)
చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అక్రమాలకు నిలయంగా మారిందని, అది సహకార సంఘం కాదు.. ‘స్వాహా’కార సంఘంగా మారిందని సీపీఐ మండల కార్యదర్శి పత్తి అనంతరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంఘం వెల్లడించిన వార్షిక లెక్కల్లో పారదర్శకత లోపించిందని, లక్షలాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని ఆయన ఆరోపించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సంఘం తీరును ఎండగట్టారు.
రూ. 18.37 కోట్ల లావాదేవీలు.. లాభాల్లో అన్నీ అనుమానాలే! అంటూ సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం రూ.18.37 కోట్ల లావాదేవీలు జరగ్గా రూ.57.54 లక్షల నికర లాభం వచ్చినట్లు చూపారని అయితే ఈ గణాంకాలు నమ్మశక్యంగా లేవని అనంతరెడ్డి విమర్శించారు. ఆదాయ విభాగంలో పూర్తి వివరాలు వెల్లడించకుండా కేవలం మొత్తం అంకెలను చూపడం వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందన్నారు. రుణాలపై వడ్డీ షేర్ క్యాపిటల్ వివరాల్లో స్పష్టత లేదని ఆరోపించారు.పెట్రోల్ బంక్ మంచినీటి పంపిణీలో గోల్‌మాల్ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లావాదేవీల్లో భారీగా అవకతవకలు జరిగాయని సీపీఐ ఆరోపించింది. రోజువారీ అమ్మకాలు నిల్వల లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వాస్తవ ఆదాయాన్ని తొక్కిపెడుతున్నారని పేర్కొన్నారు. అలాగే మంచినీటి సరఫరా విషయంలో తక్కువ ఖర్చు చేసి రికార్డుల్లో అధికంగా చూపడం ద్వారా నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు.మరమ్మతుల పేరిట మాయాజాలం..గోదాం రిపేర్ల పేరుతో భారీగా నిధులు డ్రా చేశారని కానీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగలేదని అనంతరెడ్డి ఎండగట్టారు. ఉద్యోగుల జీతాలు పరిపాలనా వ్యయాలను కూడా అడ్డగోలుగా పెంచి చూపారని మండిపడ్డారు.ఆడిటర్ పాత్రపై అనుమానాలు..ఈ అవినీతి భాగోతానికి నోడల్ అధికారి, ఆడిటర్లు వారధిలా పనిచేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. లెక్కల్లోని లోపాలను కావాలనే విస్మరిస్తూ అవినీతికి సహకరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పీఏసీఎస్ లెక్కలపై తక్షణమే స్వతంత్ర సంస్థతో పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలనీ నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ ప్రజాధనానికి సంబంధించిన ప్రతి పైసా లెక్కను బహిరంగంగా ప్రకటించాలి.ఈ ఆరోపణలతో చెన్నారావుపేట మండలంలో కలకలం రేగింది. పీఏసీఎస్ పాలకవర్గం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.