prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 8:46 am Digital Edition : PRAJA VANI

సల్లగా చూడు మైసమ్మ తల్లి.. ఘనంగా మైలారంలో బోనాల జాతర

సల్లగా చూడు మైసమ్మ తల్లి.. ఘనంగా మైలారంలో బోనాల జాతర

వేలాది భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం.. మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నస్రుల్లాబాద్, ఆగస్టు 6 (ప్రజావాణి): నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో కొచ్చరి మైసమ్మ తల్లి బోనాల జాతరను గ్రామస్తులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డీజే పాటలు, యువత కేరింతలతో గ్రామ వీధులు ఉత్సాహభరితంగా మారాయి. మహిళలు తొట్టెల బోనాలతో పెద్ద సంఖ్యలో ఆలయం వరకు ఊరేగింపుగా తరలివెళ్లి మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.

వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. “ఊరు వాడ సల్లగా చూడు తల్లి.. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలందరినీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా” అంటూ భక్తులు మైసమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

బోనాల జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. గ్రామ సర్పంచ్ భానుచందర్‌రెడ్డి, ఉమ్మడి మండల మార్కెట్ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.