prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 8:06 am Digital Edition : PRAJA VANI

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: <br><br>మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి జులై 04

అధికారులు బాధ్యత, పారదర్శకతతో పనిచేయాలి
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి శ్వేతపత్రం సిద్ధం చేయాలి యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే ఆదర్శం.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి అభివృద్ధి పనులు, భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
సన్న రకాల వరి సాగు చేసి బోనస్ పొందాలని రైతులకు సూచన జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.వ్యవసాయం, పౌర సరఫరాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, వైద్యం, విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, పరిశ్రమలు, రెవెన్యూ, తాగునీరు, విద్యుత్, అటవీ తదితర శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ శాఖల పురోగతిని వివరించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేళ్లకు పైగా పదవీకాలం ఉన్నందున ప్రతి అధికారి బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
ప్రజల సమస్యలను ఓర్పుతో విని, ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే కారణాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని అన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయిలో సమగ్ర శ్వేతపత్రం సిద్ధం చేసి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, అభిప్రాయాల ఆధారంగా లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నాయకత్వంలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సేవల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపులో జిల్లా మంచి ఫలితాలు సాధించిందన్నారు.రైతుల కోసం రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే కాకుండా దేశానికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అర్హులైన రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందేలా, అనవసర వినియోగాన్ని అరికట్టేలా పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల సన్న వరి వంగడాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
నాణ్యతలేని విత్తనాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
సన్న రకాల వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్, గత ప్రభుత్వం రైతుబంధు కింద అందించిన మొత్తాన్ని మించిందన్నారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వరి వంగడాలను సాగు చేసి బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గతంలో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవని, ప్రస్తుతం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని తెలిపారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష యూరియా యాప్ అమలుతో గత యాసంగిలో జిల్లాలో యూరియా వినియోగం 19 శాతం తగ్గిందని తెలిపారు. ఈ వానాకాలానికి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఇప్పటివరకు 21,126 మంది రైతులకు యాప్ ద్వారా 2,453 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని చెప్పారు.గత మూడు సంవత్సరాల్లో 3,572 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించి రూ.5.43 కోట్ల సబ్సిడీ అందించామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎలిగేడు వద్ద ప్రపంచస్థాయి గోదాముల నిర్మాణానికి భూమి కేటాయించినట్లు పేర్కొన్నారు.
గత యాసంగిలో 65,129 మంది రైతుల నుంచి 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.1,057 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో 6,276 ఇళ్లు మంజూరు చేయగా, 1,909 గృహప్రవేశాలు పూర్తయ్యాయని, రూ.130.24 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రెండో విడత అర్హుల ఎంపిక కోసం సర్వే కొనసాగుతోందన్నారు.మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, మేడిపల్లి పరిశ్రమల పార్కు, శ్రీపాద మార్గం–మంథని నాలుగు లైన్ల రహదారి, పెద్దపల్లి బైపాస్ వంటి ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేస్తున్నామని తెలిపారు.వైద్యం, విద్య, పరిశ్రమలు, ఉపాధి, మహిళా సంఘాల బలోపేతం, తాగునీరు, పట్టణాభివృద్ధి, అంగన్‌వాడీ సేవలు, బాల్య వివాహాల నిర్మూలన తదితర రంగాల్లో జిల్లా గణనీయమైన పురోగతి సాధించిందని వివరించారు.
సమీక్ష సమావేశానికి ముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ ఉద్యమ అమరవీరుడు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అలాగే కలెక్టరేట్ ఆవరణలో నూతన అంబులెన్స్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు సురేష్, గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ. అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్. మల్లయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.