* *షాద్నగర్ నియోజకవర్గం లోని ఓ ఎంపీడీవో కిందిస్థాయి ఉద్యోగులతో వెట్టి చాకిరి చేయించిన వైనం*
*సారూ.. కిందిస్థాయి సిబ్బంది అంటే మీకు అంత చులకనా..?*
*ప్రభుత్వ జీతాలు తీసుకునేది మీకు ఊడిగం చేయడానికేనా..?*
*ఫరూక్ నగర్ ఎంపీడీవో శ్రీకాంత్ కారును కడిగేందుకు ఇద్దరు అటెండర్లు*
*అధికారన్న గర్వం వీడితే కిందిస్థాయి సిబ్బందికి గౌరవం*
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 12 :
ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు తమ సిబ్బందికి జీతాలు ఇస్తారు.. అంతేకానీ పెద్ద అధికారుల సొంత పనులు చేయడానికి కాదు.
తాము అధికారుల మన్న అహంభావం గర్వం తలకు ఎక్కితే తమ కిందిస్థాయి సిబ్బందిని ఎంత నీచంగా చూస్తారో వేరేగా చెప్పనక్కర్లేదు. అధికారులు తమ సొంత పనులకు ప్రభుత్వ సిబ్బందిని వాడుకోరాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫరూక్ నగర్ మండల పరిషత్ ప్రభుత్వ కార్యాలయంలో ఇటీవలే బదిలీపై వచ్చిన స్థానిక ఎంపీడీవో శ్రీకాంత్ తన ఎంజి వాహనాన్ని ఇద్దరు అటెండర్ లను పెట్టి ఎంచక్కా శుభ్రం చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే? ఓ మహిళ అటెండర్, మరో అటెండర్ ఇద్దరు కలిసి నీళ్లతో కారును శుభ్రం చేస్తూ మీడియా కెమెరా కంటికి చిక్కారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మా సార్ వాహనం అంటూ అమాయకంగా సమాధానం చెప్పారు. ఇదిలా ఉంటే ఓ అధికారి మహిళా సిబ్బంది చేత తన కారును ఇలా కడిగించడం భావ్యమైన అని మీడియా ప్రశ్నిస్తుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో సొంత వాహనంకు కింది స్థాయి సిబ్బంది చేస్తున్న పరిచర్యలు చూసి ప్రజలు కూడా పలు పనులపై అక్కడికి వచ్చినవారు ఏమిటిది అని ఆశ్చర్యమే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎంతోమంది ఎంపీడీవోలు అధికారులు ఇక్కడ పనిచేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు ప్రభుత్వ సేవలు తప్ప ఇతర పనులు అటెండర్లు చేసేవారు కారు. కానీ కొత్తగా వచ్చిన ఎంపీడీవో శ్రీకాంత్ తన అధికార దర్పాన్ని అహంభావాన్ని గర్వాన్ని ప్రదర్శించే విధంగా కిందిస్థాయి సిబ్బంది చేత అది కూడా ఒక మహిళ చేత కారును శుభ్రం చేయించడం వివాదాస్పదంగా మారింది. కింది స్థాయి సిబ్బందిని కూడా గౌరవించే అధికారులు ఎంతోమంది ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారు. మరింత దారుణంగా తమ సొంత పనులకు వాడుకునేవారు కరువే అని చెప్పాలి. అయినా ప్రభుత్వం ఎంపీడీవోకు మంచి నెలసరి జీతం ఇస్తుంది. తన సొంత పనులకు ఆ జీతం లో నుంచి మరో పనిమనిషిను డ్రైవర్ ను పెట్టుకుంటే సరిపోయేది. కింది స్థాయి సిబ్బందిని కూడా సాటి మనుషుల్లా చూడాల్సిన అవసరం ఉంది. పై అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి.. !

