*షాద్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రం విడుదల*
*సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో రెండు తరాల తెలంగాణ* *ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం*
*ఉద్యమకారులకు ఇంటి స్థలం*, *గుర్తింపు కార్డులు, పింఛన్ కల్పించాలని డిమాండ్*
షాద్‌నగర్, ప్రజావాణి జూలై 31: తెలంగాణ ఉద్యమకారుల రెండు తరాల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం షాద్‌నగర్ బ్లాక్ ఆఫీస్ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద స్థానిక ఉద్యమకారులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం, గుర్తింపు కార్డులు, పింఛన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం శతాబ్దంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమని పేర్కొన్న ఆయన, ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులకు తగిన గుర్తింపు, సంక్షేమ ఫలాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే పోలీసు కేసులు నమోదు కాకపోయినా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమకారులంతా సంఘటితమై తమ హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి. వెంకట్ రాంరెడ్డి డాక్టర్ పిడమర్తి రవిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దిలీప్ కుమార్, విద్యార్థి నేత జాంగారి రవి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెళ్లి సురేష్, ఓయూ జేఏసీ నేత రహీమ్, ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నడికూడ యాదగిరి యాదవ్, ఆర్ల యాదయ్య యాదవ్, మేకల వెంకటేష్, అదేట్ల రాజు, రవికుమార్ గౌడ్, బీరప్ప, కుడుముల మల్లేష్, మహేందర్, మైలారం విశాల్‌తో పాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.