శ్రీశైలం దేవస్థానంలో వైభవంగా స్వర్ణరథోత్సవం
నంద్యాల జిల్లా, శ్రీశైలం, ఏప్రిల్ 22 (ప్రజావాణి):
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో ఈరోజు శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం వేకువజామునే ఆరుద్రోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
అనంతరం ఆలయ అర్చకులు దేశ శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేకంగా సంకల్పం చేశారు. దేశంలో అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకూడదని కోరుతూ లోకకల్యాణ సంకల్పాన్ని పఠించారు.
తదనంతరం రథారూఢులైన శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణ, వేద మంత్రోచ్చారణల మధ్య ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు రథోత్సవం ఘనంగా కొనసాగింది.
సంప్రదాయ కళలకు ప్రాధాన్యం ఇస్తూ కోలాటం, తప్పెట గుళ్లు వంటి జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు కూడా భక్తులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, అర్చకులు, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.