తిరుమలాయపాలెం, ప్రజావాణి:
వ్యవసాయ కూలీలకు రోజుకు ₹600 వేతనం ఇవ్వడంతో పాటు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని దినాలు కల్పించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు డిమాండ్ చేశారు.తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం గోకినపల్లి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఉపాధి హామీ కూలీల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఇవ్వాలని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీలలో 5,19,191 మందిని మాత్రమే గుర్తించగా, అందరికీ నిధులు ఇవ్వకుండా కేవలం 83,887 మందికే ₹53 కోట్లను చెల్లించడం అన్యాయమన్నారు.రాష్ట్రంలో ఒక ఎకరా లోపు భూమి కలిగిన 24.22 లక్షల మంది, రెండు ఎకరాల వరకు ఉన్న 17.02 లక్షల మంది నిరుపేద రైతులు జీవనోపాధి కోసం కూలి పనులపై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రస్తుత ధరల ప్రకారం ఒక కుటుంబం బ్రతకడానికి నెలకు కనీసం ₹26,000 అవసరమని పేర్కొన్నారు.వ్యవసాయ కూలీలను సమగ్రంగా గుర్తించి వెంటనే ₹12,000 భరోసా నిధులు చెల్లించాలని, ఎన్ఆర్ఈజీఎస్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న విబిజి రాంజీ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ఎలాంటి కొలతలు, ఫోటో సిస్టం లేకుండా పని ఇచ్చి రోజుకు ₹600 వేతనం చెల్లించాలని కోరారు.మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో జరగనున్న ఏఐపీకేఎంఎస్ తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గోకనపల్లి వెంకన్న, పేరం వెంకటేశ్వర్లు, అంగిరేకుల వీరబాబు, వేల్పుల సైదులు, పత్తిపురం దాస్, జటంగి సంగమ్మ, ఏనుగంటి నాగమణి, వేల్పుల కోటమ్మ, వెల్ది శోభనరావు, ఐత రాజు సుభద్ర, వీరన్న, వేల్పుల ఏకమ్మ, వెంకటమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.