prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 1:40 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వైయస్సార్ విగ్రహానికి దక్కని గౌరవం: పట్టించుకోని నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి

పోరుమామిళ్ల:జూలై 13 ప్రజావాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరుగాంచిన బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తీవ్ర అవమానం జరుగుతోంది. పోరుమామిళ్ల మండలంలోని టేకురుపేట పంచాయితీ పరిధిలో ఉన్నతిరువెంగళపురం మెయిన్ రోడ్డు వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహం ప్రస్తుతం ఎలాంటి రక్షణ లేక,పీఠంపై కాకుండా నేలపై దిక్కులేని స్థితిలో పడి ఉంది. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ,వైఎస్సార్ విగ్రహం ఇలా రోడ్డు పక్కన పిచ్చిమొక్కల మధ్య నిర్లక్ష్యానికి గురికావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాయకుల నిర్లక్ష్యంపై కార్యకర్తల ఆగ్రహం:
వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో పార్టీ కోసం ప్రాణాలు పెట్టే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎందరో ఉన్నప్పటికీ,స్థానిక రాజకీయ నాయకులు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రజా గుండెల్లో నిలిచిన మహానేత విగ్రహానికి కనీస గౌరవం కల్పించడంలో మరియు దానికి తగిన రక్షణ గోడ లేదా పీఠాన్ని ఏర్పాటు చేయడంలో నాయకులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పదవులు అనుభవిస్తూ,పార్టీ పేరు చెప్పుకుని తిరిగే కొందరు నేతలు విగ్రహాల నిర్వహణను గాలికొదిలేశారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గంలో పార్టీ పరువును బజారున పడేస్తున్న ఇలాంటి సంఘటనలపై తక్షణమే వైఎస్సార్సీపీ ఉన్నతాధికారులు మరియు స్థానిక ముఖ్య నాయకులు స్పందించాలని డిమాండ్ వినిపిస్తోంది.తిరువెంగళపురం మెయిన్ రోడ్డు దగ్గర ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని గౌరవప్రదమైన రీతిలో ఎత్తైన పీఠంపై ప్రతిష్టించి,తగిన రక్షణ కల్పించాలని,లేనిపక్షంలో కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.