వేసవిలో నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి
బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలకు ఎస్సై సౌజన్య తగు సూచనలు చేశారు.ఈ సందర్బంగా ఎస్సై సౌజన్య మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా బెజ్జంకి పోలీస్ స్టేషన్ తరఫున పలు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెరువులు, కుంటలు, కాలువలు, బావుల వంటి నీటి వనరుల వద్దకు ఈత కొట్టడానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని,ఈ నేపథ్యంలో మునిగిపోయే ప్రమాదాలుపెరుగుతున్నాయని హెచ్చరించారు.ఈత రాని వ్యక్తులు లోతైన నీటిలోకి వెళ్లకూడదని, నీటి లోతు తెలియని ప్రదేశాలను పూర్తిగా దూరంగా ఉంచాలనీ, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణ లేకుండా నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు కఠినంగా జాగ్రత్తలు తీసుకోవాలని,అలాగే ఒంటరిగా ఈతకు వెళ్లకుండా గుంపుగా వెళ్లాలని, మద్యం సేవించి నీటిలోకి దిగడం పూర్తిగా నిషేధమని,జారి పడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నిలబడకూడదని, హెచ్చరిక బోర్డులు ఉన్న ప్రదేశాలను గౌరవించాలని,లోతైన గుంతలు, మురుగు ప్రవాహాలు ఉన్న ప్రాంతాలు ప్రమాదకరమని, గ్రామస్థులు చెరువులు, బావుల వద్ద కంచెలు, తాడులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో సహకరించాలని కోరారు.ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లు గమనించిన వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి పోలీసులకు తెలియజేయాలని సూచించారు.వాతావరణ పరిస్థితులు, నీటి ప్రవాహాన్ని ముందుగానే పరిశీలించి ఈతకు వెళ్లాలని, చిన్నపిల్లలకు నీటి ప్రమాదాలపై అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని ప్రజలందరూ ఈ సూచనలు పాటించి తమ కుటుంబాలను, గ్రామాన్ని సురక్షితంగా ఉంచాలని బెజ్జంకి ఎస్సై విజ్ఞప్తి చేశారు.