*వేములవాడలో ఎడతెరిపిలేని వర్షం.. తడిసి ముద్దైన పట్టణం*
*ముసురుకున్న వానతో జనజీవనానికి అంతరాయం.. రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం*
*ప్రజావాణి వేములవాడ టౌన్ 29 జులై 2026*
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణాన్ని వర్షం వీడటం లేదు. మంగళవారం రాత్రి నుంచి పలుమార్లు కురుస్తున్న వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం కారణంగా సాధారణ జనజీవనం కొంతమేర ప్రభావితమైనప్పటికీ, వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులకు ఈ వర్షాలు దోహదపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.