ప్రజావాణి న్యూస్: (మార్చి08) కడప జిల్లా వేంపల్లిలో జరుగుతున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ను అరికట్టాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం కడప నగరంలోని స్థానిక కాగితాల పెంటలోని ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ,కడప జిల్లా వేంపల్లి ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు కుమ్మక్కు అయి ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షా కేంద్రాలలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగేలా చూస్తున్నారని వారు విమర్శించారు. వేంపల్లి ఉర్దూ కళాశాలలో జరుగుతున్న మాస్ కాపీయింగ్‌కు కొంతమంది అధికారుల సహకారం కూడా ఉందని ఆయన ఆరోపించారు. పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్న భాస్కర్ నాయక్‌ను విధుల నుండి ఎందుకు తొలగించారో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతకు చెందిన కళాశాలలో ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తమకు వచ్చాయని వారు తెలిపారు. సోమవారం, మంగళవారం జరిగే పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ నిర్వహించేందుకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయని ఇది నిజాయితీగా చదివే విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని వారు అన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వేంపల్లి ఉర్దూ కళాశాల పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలోఏ.ఐ.ఎస్.బి నాయకులు అఖిల్, సుమంత్ లు పాల్గొన్నారు