విధి నిర్వహణలో ఉన్న పోలీస్ పై దాడి……
మన సమగ్ర ప్రజావాణి మోతే 21:”సూర్యాపేట జిల్లా మోతే మండలంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఇసుక ట్రాక్టర్ డ్రైవర్, అతని అనుచరులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు మోతే ఎస్‌ఐ అజయ్ కుమార్, మండల తహశీల్దార్ సంయుక్తంగా కూడలి గ్రామ శివారులోని వాగు వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. ఈ పికెట్ వద్ద ప్రతిరోజూ 24 గంటలు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక జీపీఓ అధికారి విధులు నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కానిస్టేబుల్ కృష్ణం రాజు, జీపీఓ సుధాకర్ కలిసి విధులు నిర్వహిస్తున్నారు. కాకరవాయి నుంచి కూడలి వైపుకు వస్తున్న ఇసుక లోడ్ ట్రాక్టర్‌ను కానిస్టేబుల్ ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీంతో కానిస్టేబుల్ తన బైక్‌పై వెంటాడి ట్రాక్టర్‌ను ఆపి పత్రాలు కోరగా డ్రైవర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇదే సమయంలో డ్రైవర్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కలిసి కానిస్టేబుల్‌పై దాడి చేసి కింద పడవేసి ట్రాక్టర్‌తో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన సమయంలో వెనుక నుంచి కారులో వచ్చిన వ్యక్తి తాను సోలిపురం గ్రామ సర్పంచ్ అని చెప్పుకుంటూ ట్రాక్టర్‌ను ఎందుకు ఆపుతున్నావని దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో రాయకుంటా తండాకు చెందిన భూక్యా మధు (ట్రాక్టర్ డ్రైవర్), భూక్యా శ్రీకాంత్, నునవత్ అశోక్ (సోలిపురం సర్పంచ్) పేర్లు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.”