prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 6:48 am Digital Edition : PRAJA VANI

విద్యార్థుల హక్కులు, పరీక్షల పారదర్శకత కోసం కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వాలి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసు దౌర్జన్యానికి నిరసనగా రాహుల్ గాంధీ ధర్నా
విద్యార్థుల హక్కులు, పరీక్షల పారదర్శకత కోసం కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వాలి: తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి
షాద్‌నగర్, ప్రజావాణి, జూలై 22:
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, అలాగే తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేపట్టిన ధర్నాకు ఆయన సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ యువత భవిష్యత్తుపై తీవ్ర అనుమానాలను కలిగించిందని, న్యాయం కోసం గళం విప్పిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. విద్యార్థుల గొంతును అణచివేయడం కాకుండా, వారి ఆవేదనను ఆలకించి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
దేశ యువతకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుందని, పరీక్షల పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, దేశ ప్రజలు మద్దతు తెలపాలని తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పిలుపునిచ్చారు.