prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 6:17 pm Digital Edition : PRAJA VANI

వాహన డీలర్లకు రవాణా శాఖ కీలక హెచ్చరిక

వాహన డీలర్లకు రవాణా శాఖ కీలక హెచ్చరిక
అదనపు రుసుములు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు
పారదర్శక సేవలపై తిరుపతిలో అవగాహన సమావేశం
తిరుపతి, జూలై 1 (ప్రజావాణి):
వాహన కొనుగోలుదారులకు పారదర్శకమైన సేవలు అందించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ వాహన డీలర్లకు స్పష్టం చేసింది. జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో డీలర్లకు కీలక సూచనలు జారీ చేశారు.
వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రభుత్వ రుసుములు, పన్నులు, సేవా చార్జీల వివరాలను షోరూమ్‌లలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకు మించి అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని, వినియోగదారులకు ముందుగానే పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, చెల్లింపులపై కస్టమర్లకు పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రవాణా శాఖ అవినీతిరహిత, జవాబుదారీతనం కలిగిన సేవల కోసం కట్టుబడి ఉందన్నారు. డీలర్లు కూడా పారదర్శకత పాటిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అతికానాజ్, పరిపాలన అధికారులు విజయ్ కుమార్, విజయ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.