prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 9:29 pm Digital Edition : ELKATHURTHI

వామ్మో ఈ రోడ్లపై నడిచేది ఎలా

వామ్మో ఈ రోడ్లపై నడిచేది ఎలా

దండేపల్లి లో రోడ్ల పరిస్థితి

దండేపల్లి బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జ్ మాచర్ల తిరుపతి

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో గురువారం కురిసిన తేలికపాటి వర్షానికే గ్రామంలోని ప్రధాన రహదారులు,అంతర్గత వీధులు పూర్తిగా జలమయమై బురదమయంగా మారాయి.గ్రామంలో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. మహిళలు,విద్యార్థులు, వృద్ధులు,రైతులు నిత్యం బురదలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఇలాంటి దుస్థితి నెలకొన్నా సర్పంచ్, పాలకవర్గం మాత్రం ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందని బీజేపీ గ్రామ శక్తి కేంద్ర ఇంచార్జ్ మాచర్ల తిరుపతి తీవ్రంగా విమర్శించారు.తేలికపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపించేలా మారడం గ్రామ పంచాయతీ పనితీరుకు అద్దం పడుతోందన్నారు.
గ్రామంలోని రహదారుల ఇరువైపులా గడ్డి విపరీతంగా పెరిగిపోయినా, సైడ్ డ్రైనేజీలు పిచ్చి మొక్కలు,గడ్డితో నిండిపోయినా వాటి తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.గడ్డి నివారణ కోసం మందు పిచికారీ కూడా చేయకపోవడం,డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నిలిచిపోతోందని పేర్కొన్నారు.గ్రామ పరిశుభ్రత,మౌలిక సదుపాయాల నిర్వహణలో సర్పంచ్,పాలకవర్గం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
వెంటనే బురదమయమైన రోడ్లపై మొరం మట్టి వేయించి,గుంతలను పూడ్చి, డ్రైనేజీలను శుభ్రపరిచి,రోడ్ల పక్కన పెరిగిన గడ్డిని తొలగించి, అవసరమైన చోట గడ్డి నివారణ మందు పిచికారీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కొనసాగితే గ్రామ ప్రజలను సమీకరించి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాచర్ల తిరుపతి హెచ్చరించారు.