prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:38 am Digital Edition : PRAJA VANI

వల్భాపూర్‌లో బెల్ట్ షాపులపై నిషేధం

వల్భాపూర్‌లో బెల్ట్ షాపులపై నిషేధం.

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమాన.

గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్భాపూర్ గ్రామంలో మద్యపాన నియంత్రణకు గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.శుక్రవారం గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత అధ్యక్షతన,ఉపసర్పంచ్ అంబాల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో 18-7-26 నుండి గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
సర్పంచ్ పొనగంటి శ్వేత, ఉపసర్పంచ్ అంబాల అనిల్ మాట్లాడుతూ గ్రామంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. మద్యానికి బానిసలై ఎంతోమంది యువకులు, కుటుంబ పెద్దలు సోమరిపోతులుగా మారుతున్నారని, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ప్రాణాలు కోల్పోవడంతో పలువురు మహిళలు విధవరాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక గ్రామంలో చిన్న చిన్న గొడవలు, శాంతిభద్రతల సమస్యలకు కూడా అక్రమ మద్యం విక్రయాలే ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై వల్భాపూర్ గ్రామంలో ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించరాదని పాలకవర్గం స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి గ్రామంలోని బెల్ట్ షాపుల నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని కోరింది.
తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించినట్లు గుర్తిస్తే,సంబంధిత వ్యక్తిపై గ్రామ పంచాయతీ తరఫున రూ.10,000 వేలు జరిమానా విధించాలని పాలకవర్గం నిర్ణయించింది.
పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామ మహిళలు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొని,కుటుంబాలు సుఖసంతోషాలతో జీవించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న ఈ తీర్మానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మహిళలు విజ్ఞప్తి చేశారు.