బెజ్జంకి, జూలై 31(ప్రజావాణి)
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మహేష్ సూచించారు. ఇంట్లోకి వర్షపు నీరు చేరినప్పుడు లేదా గోడలు తడిసినప్పుడు విద్యుత్ స్విచ్‌లు, స్విచ్‌బోర్డులను తాకరాదని, తడి చేతులతో లేదా చెప్పులు లేకుండా విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దని తెలిపారు.ఇంట్లోకి నీరు చేరిన వెంటనే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలని, పిడుగులు పడే సమయంలో టీవీ, కంప్యూటర్, రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్‌లను సాకెట్ల నుంచి తొలగించాలని సూచించారు. వర్షంలో బయట తిరిగేటప్పుడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టే వైర్లకు దూరంగా ఉండాలని, విద్యుత్ లైన్లు ఉన్న చెట్ల కింద ఆశ్రయం పొందరాదని పేర్కొన్నారు.
రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు కనిపిస్తే వాటి వద్దకు వెళ్లకుండా ఇతరులను అప్రమత్తం చేసి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే పశువులను విద్యుత్ స్తంభాలు లేదా ఇనుప తీగలకు కట్టరాదని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా ,గ్రామ విద్యుత్ అధికారులను సంప్రదించాలని ఏఈ మహేష్ సూచించారు.