లంచాల సుడిగుండంలో కాశినాయన రెవెన్యూ: కలెక్టర్ నివేదికను తొక్కిపెట్టి.. ఆర్మీ పేరుతో సావిశెట్టిపల్లె పేదల భూములపై ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య కక్కుర్తి!
కడప అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటే ఏమౌతుంది?
నిబంధనలను తుంగలో తొక్కి,ఉన్నతాధికారుల ఆదేశాలనే కాలరాస్తే వ్యవస్థ ఎలా భ్రష్టు పడుతుంది? దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది
కాశినాయన జూలై 02 ప్రజావాణి మండలంలోని సావిశెట్టిపల్లె (అక్కంగుండ్ల) భూ వివాదంలో సావిశెట్టిపల్లె రెవెన్యూ విభాగం తీరు.సావిశెట్టిపల్లె గ్రామ పరిధిలో దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటూ,తమ నోటి కూడు సంపాదించుకుంటున్న విలువైన భూమిపై కొందరు అధికారులు కాటేయాలని చూస్తున్నారు.కాశినాయన ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య లంచాల కక్కుర్తికి లొంగిపోయి,ఉన్నతాధికారుల నివేదికలను పక్కనబెట్టి, క్షేత్రస్థాయి వాస్తవాలను సమాధి చేస్తూ ఇచ్చిన తప్పుడు నివేదిక ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.పేద ప్రజల కడుపు కొట్టి, లక్షల రూపాయల డీల్స్‌కు లొంగిపోయిన ఒక అధికారి అక్రమ భాగోతంపై‘ప్రత్యేక కథనం’.
అసలు కథ ఇదీ.వివాదాస్పద సర్వే నెంబర్లు!
కాశినాయన మండలంలోని సావిశెట్టిపల్లె రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 144-2 మరియు 144-4 లలో సుమారు 20 ఎకరాల భూమి ఉంది.ఈ భూమి రికార్డుల పరంగా ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం దశాబ్దాలుగా సావిశెట్టిపల్లె గ్రామ ప్రజల అనుభవంలోనే ఉంది. తాతల కాలం నుంచి ఆ భూమినే నమ్ముకుని,చెమటోడ్చి సాగు చేసుకుంటూ ఆ గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు.స్థానికంగా ఈ భూమికి మార్కెట్ విలువ భారీగా పెరగడంతో,కొందరు భూబకాసురుల కన్ను దీనిపై పడింది. ఎలాగైనా ఈ భూమిని స్థానికుల నుంచి లాక్కొని,వేరే వాళ్లకు కట్టబెట్టాలనే కుట్రకు తెరలేపారు. దీనికి కాశినాయన ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య అక్షరాలా సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరుగురు ఎమ్మార్వోల ‘గ్రౌండ్ రిపోర్ట్’ను తొక్కేసారు!
ఈ భూమిపై గతంలోనే పెద్ద ఎత్తున వివాదం నడిచింది.అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన బాబురావు నాయుడుఈ వ్యవహారంపై చాలా సీరియస్‌గా స్పందించారు.కేవలం ఒకరిద్దరు అధికారుల మాటలు నమ్మకుండా,పారదర్శకత కోసం ఏకంగా ఆరుగురు ఎమ్మార్వోలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఆరుగురు ఎమ్మార్వోల బృందం సావిశెట్టిపల్లె గ్రామానికి వెళ్లి,వివాదాస్పద సర్వే నెంబర్ల పరిధిలోని 20 ఎకరాల భూమిని అంగుళం అంగుళం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.గ్రామంలోని రికార్డులను,గత చరిత్రను,స్థానికుల అనుభవాన్ని అన్ని కోణాల్లో విచారించి.”ఈ భూమి పూర్తిగా సావిశెట్టిపల్లె గ్రామ ప్రజల అనుభవంలోనే ఉంది,వారు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నారు”అని స్పష్టమైన నివేదికను అప్పటి కలెక్టర్‌కు సమర్పించారు.ఆ అధికారిక రిపోర్టు కలెక్టరేట్ రికార్డుల్లో నేటికీ భద్రంగా ఉంది.
నిబంధనలు గాలికి.. ‘బైపాస్’ రాజకీయం!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంతటి సుదీర్ఘ వివాదం ఉన్న భూమి విషయంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా,లేదా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలన్నా జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన నిరభ్యంతర పత్రం ఉండాలి.అంతేకాకుండా క్షేత్రస్థాయిలో డిప్యూటీ తాసిల్దార్ మరియు ఆర్‌ఐ లు సంయుక్తంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.కానీ ప్రస్తుత కాశినాయన ఎమ్మార్వో వెంకటసుబ్బయ్యకు ఈ నిబంధనలేవీ పట్టలేదు.కలెక్టర్ నుంచి ఎలాంటి ఎన్ఓసి లేదు,డిప్యూటీ తాసిల్దార్ రిపోర్టు లేదు,కనీసం ఆర్‌ఐ ఇచ్చిన నివేదికా లేదు.గతంలో ఆరుగురు ఎమ్మార్వోలు ఇచ్చిన అధికారిక నివేదికను సైతం తుంగలో తొక్కేసి,ఏకపక్షంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
లేని ఆర్మీని తెచ్చారు.. లక్షల డీల్ మాట్లాడారు!
అసలు ఆ 20 ఎకరాల భూమిలో ఆర్మీ వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. వారు అక్కడ ఎప్పుడూ లేరు, ప్రస్తుతం అనుభవంలో అంతకన్నా లేరు.కానీ,ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య తన కలం పోటుతో అక్కడ లేని ఆర్మీని ఉన్నట్లు సృష్టించారు.”ఇది ఆర్మీ వాళ్ల అనుభవంలో ఉన్న భూమి”అంటూ ఒక తప్పుడు నివేదికను రాత్రికి రాత్రే తయారు చేసేశారు.సావిశెట్టిపల్లె గ్రామ ప్రజల అనుభవంలో ఉన్న భూమిని వేరే వాళ్లకు బదలాయించడానికి,కొందరు దళారుల మధ్యవర్తిత్వంతో లక్షల రూపాయల చేతులు మారాయని గ్రామస్తులు బహిరంగంగానే వీధిన పడి గగ్గోలు పెడుతున్నారు.లంచాల కక్కుర్తి కోసమే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంతటి ఘోరమైన అబద్ధాన్ని నివేదిక రూపంలో రాశారని స్థానికులు మండిపడుతున్నారు.
తమ నోటికాడి కూడును లాక్కుని,లంచాలకు ఆశపడి తప్పుడు నివేదిక ఇచ్చిన కాశినాయన ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య తీరుపై సావిశెట్టిపల్లె గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.తాము సాగు చేసుకుంటున్న భూమిని కాపాడుకోవడానికి ప్రాణాలైనా ఇస్తామని,అవినీతి అధికారుల ఆటలు సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు.జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని,గతంలో బాబురావు నాయుడు హయాంలో వచ్చిన ఆరుగురు ఎమ్మార్వోల రిపోర్టును పరిశీలించాలని కోరుతున్నారు.నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు నివేదికలు సృష్టించిన ఎమ్మార్వో వెంకటసుబ్బయ్యపై శాఖాపరమైన విచారణ జరిపి,కఠినంగా శిక్షించాలని,తమ భూములను తమకే దక్కేలా చూడాలని సావిశెట్టిపల్లె గ్రామ ప్రజలు జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.మరి ఈ అవినీతి చక్రవ్యూహంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.