రోడ్డు సమస్యతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు
రామాయంపేట మండలం: కట్రీయాల్ తండా ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో తండా వసూలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, వర్షం పడితే బురదగా మారడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
గ్రామ ప్రజలు ప్రతిరోజూ మండల కేంద్రానికి, పాఠశాలలకు, ఆసుపత్రులకు వెళ్లేందుకు ఈ రహదారినే ఉపయోగిస్తున్నారు. అయితే రోడ్డు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు, వృద్ధులు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకోవడం కష్టసాధ్యంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాప్రతినిధులు గ్రామాన్ని సందర్శించి హామీలు ఇస్తారని, తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
రోడ్డు గుంతల కారణంగా వాహనాలు తరచూ చెడిపోతున్నాయని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కట్రీయాల్ గతండా ప్రజలు వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన సీసీ లేదా బీటీ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.