Date of Publish : 27 March 2026, 1:46 amDigital Edition : VENU THIRUMALAYAPALEM
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..ఎస్సై కూచిపూడి జగదీష్
నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి
ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం
పాఠశాలల నుంచి ప్రజల వరకు అవగాహన కార్యక్రమాలు
తిరుమలాయపాలెం, ప్రజా వాణి,
రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని తగ్గించి ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ & అలైవ్” మూడవ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వాడకంలో నిర్లక్ష్యం వంటి కారణాలే ప్రధాన కారణాలన్నారు.ఈ పరిస్థితిని మార్చేందుకు శిక్షలతో పాటు అవగాహన కూడా అత్యంత అవసరమని భావించి “అరైవ్ & అలైవ్” కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, జాతీయ రహదారులు మరియు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లలో ప్రజలను నేరుగా కలుసుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్సై కూచిపూడి జగదీష్ వివరించారు.