prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 2:51 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రైతు వారోత్సవాలు

ఘట్కేసర్, మే 4 (ప్రజావాణి):    తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 4 నుంచి మే 9 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలు మండల, నియోజకవర్గ స్థాయిలోని రైతు వేదికల్లో జరుగుతున్నాయి.

“రైతు సంక్షేమం – నేల ఆరోగ్యం మన బాధ్యత” అనే ప్రధాన నినాదంతో ఈ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. రైతుల భవిష్యత్తుకు పునాది అయిన నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ పంపిణీ, రైతులతో నేల సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు.

రైతు వారంలో భాగంగా శాస్త్రీయ వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయిల్ పామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, పంట రుణాలు, సహజ వ్యవసాయం వంటి అంశాలపై నిపుణులు వివరించారు. అలాగే నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వాడకం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.

వ్యవసాయ శాఖ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉండి ఆధునిక సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, పంటల బీమా వంటి సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సేంద్రీయ సాగు, ఆయిల్ పామ్ పెంపకం, వ్యవసాయ యాంత్రీకరణపై సబ్సిడీలు అందిస్తూ రైతులకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి (డి ఏ ఓ) చంద్రకళ, డి సి ఎం ఎస్, డి ఎం సుగుణ, డి.ఎస్.ఓ శ్రీనివాస్ రెడ్డి, డి సి ఓ నాగలింగాచారి, ఏవో లావణ్య, ఏ ఈ ఓ జగదీష్, ఎండి రాహుల్ రాజ్, సహకార బ్యాంకు మాజీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, వైస్ చైర్మన్ అనంత రెడ్డి, మాజీ డైరెక్టర్లు సిహెచ్ ధర్మారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, పొచిరెడ్డి బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు, సహకార బ్యాంకు సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.