రైతు చల్లగుండాలని మున్నూరు కాపు సంఘం వన ప్రార్థన

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడుప రమేష్ ఆధ్వర్యంలో పసిరిక వనభోజనాలు
చెన్నారావుపేట మార్చి 24 ప్రజావాణి
ప్రకృతి ఒడిలో బంధాలను బలపరుచుకుంటూ, లోకానికి అన్నం పెట్టే రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చెన్నారావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడుప రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పసిరికా వన భోజనాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నిత్యం పనులతో అలసిపోయే కులబాంధవులు, మహిళలు, యువత అంతా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సరికొత్త పండగ వాతావరణం నెలకొంది. భక్తులు వనదేవతలకు, ఇష్టదైవాలకు ప్రత్యేక అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడుప రమేష్ మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించడం మన సంస్కృతిలో భాగమని, రాబోయే రోజుల్లో వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి, దేశానికి వెన్నెముక అయిన రైతు అన్న చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు. నిష్కల్మషమైన మంచి మనసుతో, పవిత్ర సంకల్పంతో భక్తులు పెట్టుకున్న ప్రతి వేడుకోలును ఆ దేవతలు తప్పక నెరవేరుస్తారనే గట్టి నమ్మకం తమకు ఉందన్నారు.సభ్యులంతా కలిసికట్టుగా పొయ్యిలు రాజేసి ఘమఘమలాడే వంటకాలను సిద్ధం చేశారు. హోదా, వయసు బేధాలు పక్కన పెట్టి అందరూ ఒకే పంక్తిలో నేలపై కూర్చుని ఆత్మీయంగా విందు ఆరగించారు. ఈ వన భోజన మహోత్సవం కేవలం వినోదం కోసమే కాకుండా, సమాజంలో ఐక్యతను మరియు ఆత్మీయ అనుబంధాలను మరింత పటిష్టం చేసేందుకు చక్కగా దోహదపడిందని సంఘం అధ్యక్షుడు అడుప రమేష్ కొనియాడారు.భోజనాల అనంతరం చిన్నలు, పెద్దలు కలిసి సాంప్రదాయ ఆటపాటలతో అలరించారు.గీతాల ఆలపన ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిత్యం ఉరుకుల పరుగుల జీవితం గడిపే తమకు ఈ వనభోజనాలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చాయని కులబాంధవులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు, యువకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.