100కు పైగా రేషన్ బస్తాల అక్రమ రవాణాను నేరుగా అడ్డుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి
ఎమ్మెల్యే రాకను గుర్తించి పరిగెత్తిన అక్రమార్కులు, చిక్కిన డ్రైవర్
గుంటూరు జూలై 10 ప్రజావాణి పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియా పై ఎమ్మెల్యే,టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు.పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు.గతంలో నల్లచెరువు,నల్లకుంట ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వయంగా అడ్డుకొని కేసులు నమోదు చేయించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, అనంతరం పోలీసు మరియు పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు.అలాగే ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ క్రమంలో గురువారం రాత్రి రేషన్ షాప్ నంబర్–150 పరిధిలోని రామనామ క్షేత్రం వద్ద భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్నట్లు 18 డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉల్లి గోపాల్ కృష్ణ గుర్తించి ఎమ్మెల్యే గళ్ళా మాధవికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గళ్ళా మాధవి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ఎమ్మెల్యే గళ్ళా మాధవి రాకను గుర్తించిన అక్రమార్కులు పారిపోగా,వాహన డ్రైవర్ చిక్కారు.అప్పటికే అక్కడ 100కు పైగా బస్తాల రేషన్ బియ్యాన్ని వాహనంలో లోడ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తించి,అడ్డుకున్నారు.అనంతరం లాలాపేట పోలీసులకు సమాచారం అందించగా,పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు తావులేదని,అక్రమ రవాణా,నిల్వలు,దుర్వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ప్రజలు కూడా ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు