prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:19 pm Digital Edition : PRAJA VANI

రుయా ఆస్పత్రికి రూ.50 లక్షల విలువైన అధునాతన అంబులెన్స్ విరాళం

ఈసీఐఎల్ సీఎస్ఆర్ నిధులతో అందజేత.. పేద రోగులకు అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగ్గా
తిరుపతి, జూలై 22 (ప్రజావాణి): తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల పరిధిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), హైదరాబాద్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా సుమారు రూ.50 లక్షల విలువైన అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రత్యేక అంబులెన్స్‌ను బుధవారం విరాళంగా అందజేసింది.
ఈ సందర్భంగా అదనపు వైద్య విద్య సంచాలకులు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. మనోహర్ మాట్లాడుతూ, పేద రోగులకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈసీఐఎల్ సంస్థ అందించిన ప్రత్యేక అంబులెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈసీఐఎల్ సంస్థకు వైద్యులు, వైద్య విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నుంచే ఈ అంబులెన్స్‌ను రోగుల సేవలో వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ హైదరాబాద్‌కు చెందిన వంశీధర్ బృందం సభ్యులు, రుయా ఆసుపత్రి సీఎస్ఆర్‌ఎంఓ డాక్టర్ బి. సుబ్బు లక్ష్మమ్మ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ వినాయక్, డాక్టర్ బి. శ్రావణ్ కుమార్, ఏడీ రమేష్, పీఆర్‌వో వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.