•రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బీరంగూడలో రోడ్డుపై కాంగ్రెస్ బైఠాయింపు
*కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని కాంగ్రెస్ విమర్శ
పటాన్‌చెరు, జూలై 22 (ప్రజావాణి): విద్యార్థులపై పోలీసుల దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించే కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బుధవారం బీరంగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీరంగూడ డివిజన్ పరిధిలోని గుట్ట కమాన్ వద్ద అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, ప్రజల గొంతుకను అణచివేయాలని చేసే ప్రయత్నాలను ప్రజాస్వామ్యబద్ధంగానే తిప్పికొడతామని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు.