prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 9:56 am Digital Edition : PRAJA VANI

రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు<br>రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత<br>

రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల మంజూరు

కార్పొరేట్ విద్యా సంస్థల సీట్ల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 కొత్త గురుకులాల ఏర్పాటు చేశాం

6 బీసీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్

వైసీపీ నాయకులు వాళ్లింటి ముందు రోడ్లు కూడా వేసుకోలేకపోయారు

వాళ్లా మిమ్మల్ని విమర్శించేది..?

ససన్నకోట బీసీ గురుకుల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి సవిత

అనంత పురం బ్యూరో  జూలై 22  మన ప్రజా వాణి
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల సీట్ల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేసుకోని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట  మహాత్మా జ్యోతిరావు పూలే  బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంత్రి సవిత పాల్గోని ప్రసంగించారు. నసన్నకోట బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు దివంగత నాయకులు పరిటాల రవి తన సొంత భూమి పది ఎకరాలను అందజేశారన్నారు. పరిటా రవి సేవా స్పూర్తి ఎందరికో మార్గదర్శకమన్నారు. నసన్నకోట బీసీ బాలికల గురుకుల పాఠశాలను తన సొంత నిధులు ఎమ్మెల్యే పరిటాల సునీత అభివృద్ధి చేస్తున్నారన్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, ఆహారం, రక్షణ కల్పిస్తోందన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్టాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో దోమలు చొరబడకుండా దోమ తెరలు ఏర్పాటు చేశామన్నారు. రుచికరమైన భోజనం అందించేలా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ
అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారన్నారు. ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను, కళాశాలలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 2014 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ లో కేవలం 32 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా మరో  కొత్తగా పది ఎంజేపీ స్కూళ్లను ప్రారంభించామన్నారు. వాటిలో అయిదు రాయలసీమలోనూ, మరో అయిదింటిని ఉత్తరాంధ్రలోనూ ఏర్పాటు చేశామన్నారు. వాటితో పాటు ఆరు బాలిక బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. నసన్నకోట బీసీ గురుకులాన్ని కూడా జూనియర్ కళాశాల అప్ గ్రేడ్ చేశామన్నారు. ఇవేకాక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నామని, డిమాండ్ ఉన్నచోట్ల వాటిని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే డిమాండ్ అధికంగా ఉందని మంత్రి సవిత తెలిపారు.

వాళ్లా మిమ్మల్ని విమర్శించేది…
తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేసుకోలేని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపైనా, తమపైనా విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నేడు తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా రూ.10,120.78 కోట్లను 42,70,802 మంది తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. విద్యా మిత్ర కిట్లను కూడా ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఎంజేపీ గురుకులాల్లో క్రీడల అభివృద్ధి కోసం స్పోర్ట్స్ కిట్లు కూడా పంపినీ చేశామని మంత్రి సవిత తెలిపారు.