prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 5:53 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

రాజారాంపల్లిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు రక్షణ కవచాలు

జగిత్యాల డీఎస్పీ కె. పురుషోత్తం రెడ్డి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, జూలై 06 (ప్రజావాణి):

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నేరాలను చాలా వరకు అరికట్టవచ్చని జగిత్యాల డీఎస్పీ కె. పురుషోత్తం రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ‘కమ్యూనిటీ పోలీసింగ్’, ‘నేను సైతం’ కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ డీఎస్పీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ…. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల భద్రతపై నిఘా ఉంచడం ఎంతో అవసరమన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రజలకు ఒక పోలీస్ లాగా రక్షణ కవచంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా దొంగతనం జరిగినప్పుడు నిందితులను త్వరగా పట్టుకోవడానికి సీసీ ఫుటేజ్ కీలక సాక్ష్యంగా మారుతుందన్నారు. “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను ఈ నిఘా నేత్రాల పరిధిలోకి తీసుకువస్తామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు, సహకరించిన సర్పంచ్, వార్డు సభ్యులకు డీఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మరిన్ని ఎక్కువ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంనర్సింహా రెడ్డి, గొల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ సాగర్ రెడ్డి, వెల్గటూర్ ఇంచార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్, స్థానిక సర్పంచ్ సంగ రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ మెరుగు జానీ, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.