prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:01 am Digital Edition : PRAJA VANI

రజకుల దోబిఘాట్ భూమి ఎక్కడ?

రజకుల దోబిఘాట్ భూమి ఎక్కడ….?

రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో రజకుల డోబిఘాట్ కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని తమకు తిరిగి అప్పగించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.గ్రామంలోని సర్వే నంబర్ 369లో రెండెకరాల పది గుంటల భూమిని 2001లో రజకుల జీవనోపాధి కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించిందని వారు తెలిపారు.అప్పటి మంత్రి,ప్రస్తుత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కేటాయింపు పత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు.డోబిఘాట్ అభివృద్ధి కోసం అప్పటి గ్రామ సర్పంచ్‌ మర్కా స్వామి పదవీకాలంలో రజకులకు డోబిఘాట్ ద్వారా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి సుమారు 4.5 లక్షల నిధులతో డోబిఘాట్ నిర్మాణంతో పాటు బోర్‌వెల్, విద్యుత్ సౌకర్యం కూడా కల్పించినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం ఆ భూమి తమ ఆధీనంలో లేకుండా పోయిందని,ఆక్రమణకు గురైందని ఆరోపించారు.
డోబిఘాట్ అందుబాటులో లేకపోవడంతో సంప్రదాయ వృత్తిని కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు.రెవెన్యూ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే సర్వే నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమిని గుర్తించి తమకు అప్పగించాలని కోరారు.ఈ విషయంపై ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రజక సంఘం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో  జనగామ సమ్మయ్య, జనగామ మల్లేష్,జనగామ నరేష్,జనగామ సురేష్,జనగామ స్వామి లు ఉన్నారు.