prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:14 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రంగసముద్ర పంచాయతీలోని రెవెన్యూలో ‘నోట్ల’ జాతర: హైకోర్టును సైతం బురిడీ కొట్టించిన వీఆర్వో.. కాసుల కక్కుర్తిపై రైతుల తీవ్ర ఆగ్రహం!

*మూడు కోర్టుల్లో కేసులు నడుస్తున్నా సాహసం..413 సర్వే నంబర్ భూమిని 417 గా మార్చి ఆన్‌లైన్ నమోదు!
*డబ్బులిస్తే చాలు.ఎవరి భూమైనా వేరేవాళ్ల ఖాతాలోకి!
*లంచాల మత్తులో చట్టాలను, న్యాయస్థానాలను తుంగలో తొక్కిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్.
*దిక్కుతోచని స్థితిలో అమాయక రైతులు.

పోరుమామిళ్ల జూలై 10 ప్రజావాణి రంగసముద్ర పంచాయతీలోని నర్సింగ్ పల్లె గ్రామంలో”డబ్బులు ఇస్తే చాలు.ఎవరి భూమినైనా,ఎవరి పేరైనా ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేస్తాం”అంటూ బహాటంగానే అవినీతి దందాకు తెరలేపాడు వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీకి చెందిన ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్  ప్రభుత్వం రైతుల భూములకు భద్రత కల్పించేందుకు డిజిటల్ రికార్డులను ప్రవేశపెడితే,సదరు మాత్రం దీన్ని తన కాసుల కనకవర్షంగా మార్చుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కంటికి రెప్పలా కాపాడాల్సిన రెవెన్యూ రక్షకుడే.లంచాల మత్తులో రైతుల పాలిట భక్షకుడిగా మారాడని స్థానికులు మండిపడుతున్నారు.
హైకోర్టు,జిల్లా కోర్టులను సైతం ఖాతరు చేయకుండా..!
రంగసముద్రం పంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా సాగుతున్న ఈ భూ దందాలో సదరు విఆర్వో ఆగడాలు పరాకాష్టకు చేరాయి. సాధారణంగా ఏదైనా భూమిపై కోర్టులో కేసు నడుస్తుంటే ఆ భూమి రికార్డులను ముట్టుకోవడానికి కూడా రెవెన్యూ అధికారులు సాహసించరు.కానీ,ఇక్కడి విఆర్వోకు మాత్రం చట్టాలన్నా, ఉన్నత న్యాయస్థానాలన్నా అస్సలు భయం లేనట్టుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.సర్వే నంబర్ 413 లో ఉన్న ఒక భూమిపై ప్రస్తుతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జిల్లా కోర్టు, అలాగే ఆర్డీఓ  కోర్టు లో కూడా కేసులు నడుస్తున్నాయి.ఇలా మూడు చోట్ల న్యాయస్థానాల పరిధిలో ఈ తీవ్రమైన వివాదం నడుస్తున్నప్పటికీ, సదరు విఆర్వో భారీగా లంచం ఆశించి, కోర్టు ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేశాడు. చట్టం కళ్ళు కప్పేందుకు ఒక ముఠాగా ఏర్పడి,అది వివాదాస్పదమైన 413 వ సర్వే నంబర్ అని తెలిసినా.ఆన్‌లైన్ రికార్డుల్లో మాత్రం తప్పుడు సమాచారంతో దాన్ని 417 సర్వే నంబర్ అని చూపిస్తూ వేరే వ్యక్తుల పేరు మీదకు ఎక్కించేశాడు. అసలు యజమానులకు కనీస సమాచారం ఇవ్వకుండా,కేవలం నోట్ల కట్టలకు లొంగిపోయి చేసిన ఈ మహా దారుణం ఇప్పుడు రంగసముద్రం రెవెన్యూ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఒకటి కాదు. రెండు కాదు.. అన్నీ అక్రమాలే!
సదరు అధికారి లీలలు కేవలం ఈ ఒక్క సర్వే నంబర్‌తోనే ఆగలేదు.రంగసముద్రం పంచాయతీ పరిధిలోని అనేక సర్వే నంబర్లలో ఇలాంటి దారుణాలు జరిగినట్లు రైతులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

* తరతరాలుగా సాగు చేసుకుంటున్న అమాయక, నిరక్షరాస్యులైన రైతులను టార్గెట్ చేయడం.
* వారి రికార్డులలో వెబ్‌ల్యాండ్ లోపాలు ఉన్నాయంటూ భయభ్రాంతులకు గురిచేయడం.
* అదే సమయంలో కాసుల గడ్డి కరిపించిన భూ బకాసురుల పేర్లను ఆన్‌లైన్ రికార్డుల్లో చేర్చడం.

ఇలాంటి దందాల వల్ల అసలైన రైతులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి,బ్యాంక్ లోన్లు రాక, ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే భూమిపై మూడు కోర్టుల్లో కేసులు నడుస్తున్నా, సర్వే నంబర్ మార్చి మరీ ఆన్‌లైన్ చేసిన విఆర్వో తెగింపుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
నా రేట్ ఇస్తే ఎలాంటి భూమినైనా మార్చేస్తా
“నువ్వు సాగు చేస్తున్నావా? లేదా? హైకోర్టులో కేసు ఉందా? లేదా? అనేది నాకు అనవసరం.నాకు ముట్టాల్సిన ముడుపులు ముట్టితే చాలు,సర్వే నంబర్ మార్చైనా సరే నీ పేరు మీద ఆన్‌లైన్ లో చూపిస్తా” అంటూ సదరు విఆర్వో బహిరంగంగానే కొందరు దళారులతో వ్యాఖ్యానించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను, న్యాయస్థానాల ఆదేశాలను తుంగలో తొక్కి,కేవలం స్వలాభం కోసం పనిచేస్తున్న ఈ అధికారి వెనుక మండల స్థాయిలోని పెద్దల హస్తం కూడా ఉందా అనే अनुమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ అక్రమ ఆన్‌లైన్ మార్పిడిల వల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్న రంగసముద్రం పంచాయతీ రైతులు ఇప్పుడు పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పగలు,రాత్రి కష్టపడి పండించిన భూమిని, కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాలను కూడా ఎవడో ఏసీ గదుల్లో కూర్చుని కాగితాల్లో తారుమారు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.వెంటనే జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ స్పందించి, రంగసముద్రం పంచాయతీలో జరిగిన అన్ని సర్వే నంబర్ల ఆన్‌లైన్ రికార్డులపై, ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్న భూములపై జరిగిన మార్పిడిలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.లంచాలు తీసుకుని కోర్టు ధిక్కరణకు పాల్పడిన విఆర్వోను తక్షణమే సస్పెండ్ చేసి,కేసులు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని స్థానిక రైతాంగం ముక్తకంఠంతో కోరుతోంది.పూర్తి వివరాలతో రేపటి సంచికలో మీ ప్రజావాణి ప్రజల ముందు