బెజ్జంకి, ఆగస్టు 6 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామ పంచాయితీ మైనర్లు వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు గ్రామ పంచాయితీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 6 నుంచి మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలు ఇచ్చి నడిపించిన తల్లిదండ్రులకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించడంతో పాటు, సంబంధిత మైనర్‌ను పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మైనర్లు వీరాపూర్ గ్రామంలో వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే వారి వాహనాలను సీజ్ చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ నిర్ణయం గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో తీసుకున్నట్లు తెలిపారు. మైనర్ల చేత వాహనాలు నడపించకుండా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి, గ్రామంలో రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.