prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 12:26 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

మేడ్చల్ జిల్లాలో ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ వినతి… ఎఫ్‌టీఎస్ సిబ్బంది పునరుద్ధరణతో పాటు 15 నెలల బకాయి వేతనాల విడుదల కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం

మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 3: 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (ఎఫ్‌టీఎస్), డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్లు (డీసీ), కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను పునరుద్ధరించాలని, జిల్లాలో తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని కోరుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎఫ్‌టీఎస్, డీసీ సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో వారు పేర్కొన్న వివరాల ప్రకారం, 2018 నుంచి ధరణి, ప్రస్తుతం భూ భారతి ప్రాజెక్టు కింద తహశీల్దార్ కార్యాలయాలు, జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాల్లో సాంకేతిక సేవలు అందిస్తున్నామని తెలిపారు. డిజిటల్ భూ పరిపాలన, ఆన్‌లైన్ మ్యుటేషన్లు, భూ లావాదేవీలు, డేటా ధృవీకరణ, పౌర సేవల నిర్వహణలో తమ సేవలు కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆమోదిత పోస్టుల సంఖ్య 636 నుంచి 332కు తగ్గించడంతో జిల్లాలో కూడా పలువురు అనుభవజ్ఞులైన సాంకేతిక సిబ్బంది ఉపాధి కోల్పోయారని, దీంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం గణనీయంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 11 నెలలు, 2026 ఏప్రిల్ నుంచి జూలై వరకు మరో 4 నెలలు కలిపి మొత్తం 15 నెలల వేతనాలు బకాయిగా ఉన్నాయని, ఈ కారణంగా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి, సీసీఎల్‌ఏకు సానుకూల సిఫార్సులు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఎఫ్‌టీఎస్, డీసీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, అవసరమైన మండలాల్లో అదనపు సాంకేతిక సిబ్బందిని నియమించడం, బిల్ టోకెన్ నంబర్లు 2603332438, 2603865002కు సంబంధించిన పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయడం, సిబ్బందిని ఐఎఫ్‌ఎంఐఎస్ పరిధిలోకి తీసుకువచ్చి ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

భూ భారతి ప్రాజెక్టు విజయవంతంగా అమలు కావాలంటే అనుభవజ్ఞులైన సాంకేతిక సిబ్బందిని కొనసాగించడం అత్యవసరమని, తమ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఎఫ్‌టీఎస్, డీసీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.