prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 3:42 pm Digital Edition : PRAJA VANI

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి
మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో ఓ చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు, అటవీ ప్రాంతం నుంచి ఆహారం, నీటి కోసం బయటకు వచ్చిన చిరుతపులి రహదారిని దాటే ప్రయత్నంలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి అటవీ శాఖ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి జంతువులు తరచూ రహదారులపైకి వస్తున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల సమీపంలో వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. అలాగే వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.