సిద్దిపేట్ ములుగు, మార్చి 31, ప్రజావాణి
ములుగు మండలం వంటిమామిడి లోని ఆర్.వి.ఎం మెడికల్ కళాశాలలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్,
ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది ప్రాణాపాయానికి దారితీస్తుందని, అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకోవద్దని కోరారు. యువత మత్తు పదార్థాలు మరియు ఇతర వ్యసనాలకు బానిసలు కాకూడదని హెచ్చరించారు. ఒక్కసారి తప్పుడు మార్గంలో వెళ్తే అది కెరీర్‌ను, జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒకరికొకరు స్నేహభావంతో మెలగాలని సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని కమిషనర్ హితవు పలికారు. ఏదైనా సమస్య ఎదురైతే విద్యార్థులు తమ సీనియర్లను లేదా అధ్యాపకులను సంప్రదించాలి. సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప, ఆత్మహత్య వంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ హాస్పిటల్‌లోని సీసీటీవీ మానిటరింగ్ వ్యవస్థను స్వయంగా తనిఖీ చేశారు. భద్రతా దృష్ట్యా నిరంతరం నిఘా కొనసాగించాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి నర్సింలు, గజ్వెల్ రూరల్ సిఐ రవిరాజు, స్థానిక ములుగు ఎస్ ఐ రఘుపతి , హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు మరియు 1000 పైగా విద్యార్థులు పాల్గొన్నారు.