prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 12:22 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

మున్సిపల్ కార్మికుల సమస్యలకు పోరాటమే ఏకైక మార్గం: కే. రవిచంద్రన్

ఘట్కేసర్, ఏప్రిల్ 15 (ప్రజావాణి):ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని మహిళా భవన్‌లో బుధవారం మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కామ్రేడ్ ఎం. రామచంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని తెలిపారు. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులను తక్షణమే శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన కోరారు. గత ఆరు నెలలుగా కార్మికుల వేతనాల నుండి పీఎఫ్ కట్ అయినప్పటికీ, అది వారి ఖాతాల్లో జమ కాకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే, 60 సంవత్సరాలు పైబడిన లేదా అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం గౌరవ అధ్యక్షులు లొట్టి ఈశ్వర్, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి బి. నరేందర్, జిల్లా నాయకులు ఏ. బాబు, ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్ అధ్యక్షులు జి. సువర్ణ, ఉపాధ్యక్షులు శ్రీరాములు, కార్యదర్శి రామ్‌కుమార్, ప్రచార కార్యదర్శి జి. రాజు, కోశాధికారి అరుణతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.