prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 7:14 am Digital Edition : PRAJA VANI

మీరు తప్పు చేసి మాపై నెట్టుటం సరైంది కాదు<br>

**మీరు తప్పు చేసి మాపై నెట్టుటం సరైంది కాదు*

*కొత్తూరు ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నేత ఎం. శివశంకర్ గౌడ్*

*సిద్దాపూర్ భూములు కాలుష్య పరిశ్రమల తరలింపుపాపం “బిఆర్ఎస్ దే”*

*2018 టీఎస్‌ఐఐసీ పత్రాలలో మీరు సిద్ధాపూర్ కు చేసిన అన్యాయం కనిపించలేదా..?*

*ఇందిరమ్మ ఇచ్చిన భూములను బిఆర్ఎస్ పరిశ్రమల ఏర్పాటు పేరుతో లాక్కున్నారు*

*బినామీ పేర్లతో అదే భూముల్లో 9 కోట్లు అడ్డంగా దోచుకున్నారు*

*అధికారంలో ఉన్న ప్రజల పక్షానే..*
షాద్ నగర్ ప్రజావాణి జూలై 14 :
ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిద్ధాపూర్ పేద ప్రజల భూముల విషయంలో అన్యాయంగా వ్యవహరించి కాలుష్యకార పరిశ్రమల తరలింపు పేరుతో వాటిని లాక్కుని చివరకు అదే భూములను బినామీ పేర్లతో 9 కోట్ల రూపాయలు వసూలు చేసి నాయకులు జేబులు నింపుకున్నది నిజం కాదా అని కొత్తూరు ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ ఎం. శివ శంకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా ఆయన పలు విషయాలు మీడియాకు వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ పేద ప్రజలకు 200 ఎకరాలకు పైగా భూములను పంపిణీ చేస్తే ఆ భూములను కెసిఆర్ ప్రభుత్వం అడ్డంగా లాక్కుని దోచుకుందని అన్నారు. హైదరాబాద్ నగరం వెలుపల కాలుష్యకార పరిశ్రమల ఏర్పాటు పేరుతో సిద్దాపురం గ్రామాన్ని ఎంచుకొని ఆ భూములను ప్రజల నుండి బలవంతంగా లాక్కొని అందులో కాలుష్యకర పరిశ్రమలకు ఆనాటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని శివశంకర్ గౌడ్ అన్నారు. అంతేకాదు సదరు భూముల్లో 90 ఎకరాలలో బినామీ పేర్లు సృష్టించిన బిఆర్ఎస్ నాయకులు కొందరు 9 కోట్ల రూపాయలకు పైగా దండుకొని జేబులో నింపుకున్నారని శివశంకర్ గౌడ్ విమర్శించారు.

*ఇది నిజం కాదా..?*

2018 టీఎస్‌ఐఐసీ పత్రాలకు సంబంధించి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ అనేక విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఓఆర్‌ఆర్ వెలుపల కాలుష్య పరిశ్రమల ఏర్పాటుకు 233.10 ఎకరాల భూ సేకరణ ప్రతిపాదన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను పరిశ్రమల పార్కు కోసం సేకరించాలన్న ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశం కాలుష్య పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపలికి తరలించడమేనని మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ విమర్శించారు. 2018 నాటి టీఎస్‌ఐఐసీ అధికారిక పత్రాలలో బిఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి బండారాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. 2018 జూలై 24న టీఎస్‌ఐఐసీ ల్యాండ్స్ వింగ్ విడుదల చేసిన ఇంటర్ ఆఫీస్ మెమోతో పాటు జోనల్ మేనేజర్ డి.రవి జిల్లా కలెక్టర్‌కు పంపిన ఫారం-బీ పత్రంలో, సిద్దాపూర్ గ్రామ సర్వే నంబర్లు 361, 252, 278లో మొత్తం 233 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ, అసైన్డ్ భూమిని పరిశ్రమల పార్కు కోసం సేకరించాలని కోరారనీ
ఈ పత్రాల్లో ఓఆర్‌ఆర్ వెలుపల కాలుష్య పరిశ్రమలను తరలించడం అనే ఉద్దేశాన్ని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఇందుకోసం భూమి గుర్తింపు పూర్తయిందని, భూ సేకరణ ప్రక్రియను తెలంగాణ భూ సేకరణ చట్టం–2017 ప్రకారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆనాడు కోరినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పారు. అలాగే పరిశ్రమల ప్రాజెక్టును భూ సేకరణ చట్టంలోని కొన్ని నిబంధనల నుంచి మినహాయించాలని ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 2018 జూలై 23న లేఖ రాసినట్లు కూడా పత్రాల్లో ప్రస్తావించారనీ గుర్తు చేశారు.
ఇక జత చేసిన వివరాల ప్రకారం సిద్దాపూర్ గ్రామాల పరిధిలో మొత్తం 330.34 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, అందులో 233.10 ఎకరాలు అసైన్డ్ భూమి, 97.24 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నమోదైనట్లు పేర్కొన్నారు.
ఈ అధికారిక పత్రాలు వెలుగులోకి రావడంతో సిద్దాపూర్ భూముల సేకరణ ప్రతిపాదన, కాలుష్య పరిశ్రమల తరలింపు అంశంపై
ప్రజలు వాస్తవాలు తెలుసుకొని బిఆర్ఎస్ పార్టీని నిలదీయాలని అన్నారు.

*అధికారంలో ఉన్న ప్రజల పక్షానే..*

కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు ఈ సమయంలో అనవసరమైనప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలపడానికి తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని శివశంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
అధికారంలో తమ పార్టీ ఉన్నప్పటికీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించబోమని ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో ఈ ప్రాంతంలో 641 జీవో లేకుండా డంపింగ్ యార్డ్ రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కేవలం స్వార్ధ రాజకీయాలు అనైతిక వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు..